పిఠాపురంలో మళ్లీ ఫ్లెక్సీ చిచ్చు.. పవన్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ వర్మపై ముద్రగడ క్రాంతి ఫైర్

  • పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదం.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట
  • సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం
  • వర్మ తీరుపై జనసేన నేత ముద్రగడ క్రాంతి తీవ్రస్థాయిలో విమర్శలు
  • ఉద్దేశపూర్వకంగానే పవన్ కల్యాణ్‌ను వర్మ టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ
  • కూటమిలో చిచ్చు పెట్టేలా వ్యవహరించవద్దని వర్మకు క్రాంతి హితవు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అధికార కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటకు, ఉద్రిక్తతకు కారణమైంది.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పీఏడీఏ) కార్యాలయంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడాన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ.. అక్కడి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న జనసేన నేతలు తుమ్మలబాబు, పెండెం దొరబాబులు వర్మతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పెండెం దొరబాబు, వర్మపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది.

ఈ ఘటనపై జనసేన పార్టీ నేత, ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఘాటుగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి వర్మ వైఖరి వింతగా ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఆయన రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. "ఫ్లెక్సీలో ఫొటోల గురించి రగడ సృష్టించడం ఏమిటండి? ఈ రెండేళ్లలోనే ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ రూ.600 కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గానికి తీసుకొచ్చారు. ఇంకా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. అయినా చీటికీ మాటికీ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం సరికాదు" అని క్రాంతి అన్నారు.

పవన్ కల్యాణ్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదని, జనసేన అధినేతగా ఎన్డీయేలో భాగస్వామి అనే విషయాన్ని వర్మ గుర్తుంచుకోవాలని ఆమె హితవు పలికారు. వర్మ తీరు కూటమిలో చిచ్చు పెట్టేలా ఉందని, ప్రజల్లో కూడా దీనిపై గుసగుసలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ, ఇలా బహిరంగంగా వ్యవహరించి వార్తల్లోకి ఎక్కడం సబబు కాదని సూచించారు. ఇప్పటికైనా వర్మ తన తీరు మార్చుకోవాలని క్రాంతి సలహా ఇచ్చారు.

Mudraada Kranthi
Pawan Kalyan
Pithapuram
SVSSN Varma
TDP Janasena alliance
Andhra Pradesh politics
Flexi controversy
Political conflict
Area Development Authority
Chandrababu Naidu

More Telugu News